అమెరికాలో చదువుకోవాలంటే… పూర్తి సమాచారం..

అమెరికాలో చదువుకోవాలంటే… పూర్తి సమాచారం.. సంక్లిప్తంగా!

Related Image

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడం అన్నది భారతీయ విద్యార్థులకు అదొక ఎయిమ్! ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, యూనివర్సిటీలు అక్కడ గణనీయ సంఖ్యలో ఉన్నాయి. వాటిల్లో చదివితే ఆ గుర్తింపే వేరు. పైగా అక్కడే ఉద్యోగం చేసుకోగల అవకాశాలు, రూపాయితో పోలిస్తే డాలర్ విలువ, సౌకర్య జీవనం ఇవన్నీ కూడా భారతీయ విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు చదువుతూనే ఉద్యోగం (పార్ట్ టైం) చేసుకుంటూ తగినంత ఆదాయాన్ని పొందే వెసులుబాటు కూడా ఉంది. అందుకే పేరొందిన విద్యా సంస్థలు ఆస్ట్రేలియా, యూకే, కెనడా తదితర దేశాల్లో ఎన్నో ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం అమెరికాకే మొగ్గు చూపుతుంటారు. ఎం.ఎస్.తో బాటు బిజినెస్ అండ్ మేనేజ్ మెంట్ కోర్సుల కోసం ఎక్కువ మంది అమెరికాను ఎంచుకుంటున్నారు.

స్వేచ్ఛతో కూడిన అత్యుత్తమ విద్య

స్వేచ్ఛతో కూడిన విద్య, బహుముఖ సంస్కృతి అమెరికాలోని అనుకూలతలు. అమెరికాలోని విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ముందుగా అభ్యర్థులు కొన్ని అర్హతలు సాధించాల్సి ఉంటుంది. టోఫెల్, శాట్ వంటి పరీక్షలు ఇందుకు అవకాశం కల్పిస్తాయి. అమెరికాలోని కళాశాలలు సాధారణంగా ప్రవేశాలు కల్పించే ముందు అభ్యర్థుల గ్రేడ్ పాయింట్ యావరేజ్, ప్రవేశ పరీక్షలో మార్కులు, ఇంగ్లిష్ భాషా నైపుణ్యం ఇతరత్రా అంశాల ఆధారంగా ఓ నిర్ణయానికి వస్తాయి. స్కాలస్టిక్ అసెస్ మెంట్ టెస్ట్ (శాట్), అమెరికన్ కాలేజీ టెస్టింగ్ (ఏసీటీ), శాట్ 2 పరీక్షలను కళాశాలలు నిర్వహిస్తుంటాయి. ఇంగ్లిష్ పరిజ్ఞానం తగినంత లేదని భావిస్తే కొన్ని కళాశాలలు కోర్సు ప్రారంభానికి ముందుగా ఇంగ్లిష్ క్లాసులకు హాజరుకావాలనే నిబంధన మేరకు అవకాశం కల్పిస్తాయి. అడ్వాన్స్ డ్ ప్లేస్ మెంట్ ప్రొగ్రామ్ (ఏపీ)  కాలేజీ క్రెడిట్ కు అవకాశం కల్పిస్తుంది. ఏపీ ఎగ్జామ్స్ స్కోరు ఉంటే ప్రవేశాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఈ పరీక్షను అమెరికాతోపాటు 60 దేశాల్లోని కళాశాలలు గుర్తించాయి. అమెరికా ప్రభుత్వం విద్యా సంస్థలకు గుర్తింపు ఇచ్చేందుకు స్వతంత్ర విభాగాలను ఏర్పాటు చేసింది. ఇవే విద్యా సంస్థలకు గుర్తింపు ఇస్తాయి. అడ్మిషన్ తీసుకునే ముందు ఆయా సంస్థలకు గుర్తింపు ఉందా లేదా? పరీశీలించుకోవాలి.

మూడు రకాల వీసాలు..

అమెరికాలో విద్యకు సంబంధించి స్టూడెంట్ వీసాల్లో ఎఫ్1, ఎం1, జే1 అని మూడు రకాలు ఉన్నాయి. అకడమిక్ కోర్సులైన ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్, డాక్టరేట్ ప్రోగ్రామ్స్ చేయాలనుకునే విద్యార్థులు ఎఫ్ 1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్2 అనే మరో వీసా ఉంది. ఎఫ్1 వీసా తీసుకునే వారిపై ఆధారపడినవారు.. అంటే భార్య, పెళ్లి కాని పిల్లలు (21 ఏళ్ల లోపు) కోసం ఉద్దేశించినది. ఎఫ్2 వీసాతో అమెరికా వెళ్లిన పిల్లలు అక్కడ ఎలిమెంటరీ, సెకండరీ స్కూళ్లలో చదువుకునేందుకు అవకాశం ఉంది. పైన చెప్పినవి కాకుండా నాన్ అకడమిక్ లేదా ఒకేషనల్ కోర్సుల కోసం ఎం1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తిపరమైన, భాషాపరమైన సర్టిఫికెట్ కోర్సుల్లాంటివి ఈ విభాగంలోకి వస్తుంటాయి. అలాగే, ఎం1 వీసా హోల్డర్లపై ఆధారపడిన వారి కోసం ఎం2వీసా. మూడో విభాగమైన జే1 వీసా విద్యా సంస్థల మధ్య ఒప్పందంలో భాగంగా విద్యార్థుల మార్పిడి, పరిమిత కాలం పాటు శిక్షణ కోసం వెళ్లే వారికి ఉద్దేశించినది. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, డాక్టరేట్ కోర్సుల తర్వాత పరిశోధనల కోసం ఈ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. వీరిపై ఆధారపడిన వారు అమెరికా వెళ్లేందుకు జే2 వీసా తీసుకోవాలి.

నిబంధనలు పాటిస్తేనే…

స్టూడెంట్ వీసా తీసుకునే వారు అమెరికా చట్టాలకు అనుగుణంగా అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. వీసా జారీ చేయాలా? లేదా? అన్న సంపూర్ణ అధికారం కాన్సులర్ ఆఫీసర్ కు ఉంటుంది. కోర్సు ముగియగానే అమెరికా విడిచి వెళ్లిపోతామని స్పష్టంగా పేర్కొనాలి. కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన ఫీజులు, అమెరికాలో నివాసానికి అవసరమైన ఖర్చులకు తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయని అందుకు ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఎఫ్2, ఎం2, జే2 వీసా తీసుకునే వారు తమని తాము పోషించుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయని, కాలపరిమితి ముగియగానే అమెరికాను విడిచి వెళతామని ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఎఫ్2, ఎం2, జే2 వీసా కలిగిన వారు అమెరికాలో ఉద్యోగం, సంపాదించుకునేందుకు అవకాశం లేదు.

వీసా కోసం ముందు ఇవి

ఎఫ్, ఎం వీసాలకు దరఖాస్తు చేసుకోవాలంటే… ముందుగా అమెరికాలో సంబంధిత విద్యా సంస్థలు ఐ20 పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. జే వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు డీఎస్ 2019 పత్రాన్ని పొందాలి. ఈ పత్రాలతోనే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సు ప్రారంభానికి 120 రోజుల్లోపు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, కోర్సు ప్రారంభానికి 30 రోజుల ముందుగానే అమెరికాలో ప్రవేశించడానికి అనుమతిస్తారు. ఎఫ్1 వీసా హోల్డర్లకు పాస్ పోర్ట్ విషయంలో వెసులుబాటు ఉంది. కోర్సు పూర్తి కాకముందే పాస్ పోర్ట్ గడువు తీరిపోయినా కూడా అక్కడ ఉండేందుకు అనుమతి ఉంటుంది. అయితే, స్వదేశానికి తిరిగి వెళ్లాలంటే మాత్రం ముందుగా అక్కడి భారత ఎంబసీ నుంచి నూతన పాస్ పోర్ట్ తీసుకోవాలి.

అమెరికాలోని స్కూళ్లల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విదేశీయులు చదువుకోవడానికి అవకాశం లేదు. సెకండరీ విద్య అంటే 9, 10 తరగతులు చదవాలని అనుకుంటే వారికి కూడా ఎఫ్1 వీసా జారీ చేస్తారు. అయితే, దీనికింద గరిష్ఠంగా 12 నెలలు మాత్రమే అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యకయ్యే వ్యయాన్ని సంబంధిత విద్యార్థి చెల్లించినట్టుగా ఆయా స్కూళ్లు ఐ20 పత్రంలో పేర్కొంటేనే వీసా జారీ అవుతుంది.

ఎఫ్ 1 వీసాపై మొదటి ఏడాది క్యాంపస్ బయట పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడానికి నిబంధనలు అనుమతించవు. అమెరికా పౌర, వలసవాదుల సేవా విభాగం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొదటి ఏడాది తర్వాత క్యాంపస్ వెలుపల పార్ట్ టైమ్ ఉద్యోగానికి అనుమతించవచ్చు. క్యాంపస్ లో చదువుకుంటూనే అక్కడే పార్ట్ టైమ్ ఉద్యోగ అవకాశం వస్తే ఎవరి అనుమతి లేకుండా చేసుకోవచ్చు. అది కూడా వారంలో 20 గంటలకు మించకూడదు. సెలవుల్లో, సమ్మర్ బ్రేక్ లో వారంలో 40 గంటల వరకు పని చేసుకోవచ్చు. నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం అమెరికా నుంచి అర్థాంతరంగా పంపించేస్తారు. ఎం1, జే1 వీసా హోల్డర్లు కూడా ఉద్యోగం చేయడానికి వీలు లేదు.

ఫెడరల్ గవర్నమెంట్ చట్టాల ప్రకారం… 20 ఏళ్లలోపు వయసు ఉన్న పనివారికి గంటకు కనీసం 4.25 డాలర్లు వేతనంగా చెల్లించాలి. ఇది ఆ ఏడాదిలో మొదటి 90 రోజులకు వర్తిస్తుంది. 90 రోజులు దాటిన తర్వాత లేదా 20 ఏళ్ల వయసు వచ్చిన వారికి (ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది) గంటకు కనీసం 7.25 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులకు ఈ కనీస వేతనాల్లో 85 శాతానికి తగ్గకుండా చెల్లించాలి.

కొన్నింటిలో ఎక్కువే…

అయితే ఇవి కనీస వేతనాలు మాత్రమే. ఇంతే ఇవ్వాలని లేదు. డిమాండ్ ను బట్టి  పనిచేస్తున్న రంగాన్ని బట్టి ఇంతకంటే వేతనాలు ఎక్కువే చెల్లించవచ్చు. ఉదాహరణకు ట్యూటర్లు గంటకు సగటున 17 డాలర్లు వేతనంగా పొందుతున్నారు. అనుభవం ఎక్కువగా ఉంటే ఈ వేతనం కూడా అధిక స్థాయిలోనే ఉంటుంది. రెస్టారెంట్లలో ఫుడ్ వర్కర్ల వేతనం సగటున గంటకు 8 డాలర్లుగా ఉంది. కనీసం 7 డాలర్ల నుంచి గరిష్ఠం 9 డాలర్ల వరకు చెల్లిస్తుంటారు. అనుమతి లేకపోయినా చట్టవిరుద్ధంగా చాలా మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. అక్కడి వ్యాపారస్థులు వీరి అవసరాన్ని అవకాశంగా తీసుకుని తక్కువ మొత్తాలకే పనిచేయించుకుంటుంటారు. పట్టుబడితే ఇరువురిపై చర్యలు తప్పదు.

అమెరికాలో టాప్ వర్సిటీలు..

2015-16 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో 30వరకు అమెరికా నుంచే ఉన్నాయి… వాటిపై ఓ సారి లుక్కేద్దాం… ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే నంబర్ 1గా మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నిలిచింది. ఫిజికిల్ సైన్సెస్, ఇంజనీరింగ్, బయాలజీ, ఎకనమిక్స్, లింగ్విస్టిక్స్, మేనేజ్ మెంట్ కోర్సులకు ఈ యూనివర్సిటీకి మంచి పేరుంది. హార్వర్డ్ యూనివర్సిటీ రెండో ర్యాంకులో ఉంటుంది. ఈ వర్సిటీ అందించే లైఫ్ సైన్సెస్, మెడిసిన్ కోర్సులకు మంచి గుర్తింపు  ఉంది.  స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ(3)లో బిజినెస్ కోర్సులు చదివితే తిరుగు ఉండదు. అంతేకాదు, ఈ యూనివర్సిటీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల విషయంలో ఎంఐటీ తర్వాత వరల్డ్ నంబర్ 2 స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఉన్న క్యాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ…  రీసెర్చ్, సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో టాప్ ప్లేస్ లో ఉంటుంది. ప్రపంచంలో పదో ర్యాంకులో నిలిచిన యూనివర్సిటీ ఆఫ్ చికాగో సైన్స్ ఆర్ట్స్ కోర్సులకు అత్యున్నతమైన విద్యా సంస్థగా పేర్కొంటారు. 89 మంది నోబెల్ బహుమతి విజేతలు ఇదే యూనివర్సిటీలో చదివిన వారే. తర్వాతి స్థానం ప్రిన్స్ టన్ యూనివర్సిటీది. 1746లో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ అందించే ఆర్ట్స్, హ్యుమానిటీ కోర్సులకు చక్కని గుర్తింపు కలదు. యేల్ యూనివర్సిటీ అమెరికాలో టాప్ 7స్థానంలో ఉంది. ప్రపంచంలో 15వ ర్యాంకు సొంతం చేసుకుంది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన వారిలో ఐదుగురు ఈ వర్సిటీ విద్యార్థులే. అమెరికాలో తొలి పీహెచ్ డీ అందించింది కూడా ఇదే యూనివర్సిటీ. ప్రపంచంలో 16వ ర్యాంకులో ఉన్న జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధనల పరంగా విశిష్టత కలిగినది. కార్నెల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.స్వార్త్ మోర్ కాలేజ్, ద కాలేజీ ఆఫ్ విలియమ్ అండ్ మేరీ, విలియమ్స్ కాలేజీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా, డ్యూక్ యూనివర్సిటీ, వాషింగ్టన్ అండ్ లీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ విర్జీనియా, వాండర్ బిల్ట్ యూనివర్సిటీ, కాల్గేట్, రైస్, బ్రౌన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, కాపర్ యూనియన్, టెక్సాక్ ఏఅండ్ఎం యూనివర్సిటీ, జార్జియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కార్నెల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, అండ్ ఆస్టిన్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా ఎట్ లాస్ ఏంజెల్స్, నార్త్ వెస్ట్రన్స్ యూనివర్సిటీ, కొలంబియా, జార్జిటౌన్ యూనివర్సిటీ వంటివి ప్రముఖ వర్సిటీల జాబితాలో ఉన్నాయి.

విద్యకు కేంద్రాలుగా ఉన్న ప్రముఖ నగరాలు..

న్యూయార్క్ సిటీ: నిద్రించని నగరంగా దీనికి పేరు. కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు ఇది కేంద్రంగా ఉంది.

బోస్టన్: మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీ, టఫ్స్ యూనివర్సిటీ, బ్రాండీస్ యూనివర్సిటీ, బోస్టన్ కాలేజీ, నార్త్ఈస్ట్రన్ కాలేజీ, నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలు ఇక్కడే ఉన్నాయి. సమీపంలోనే కేంబ్రిడ్జ్ సిటీ కూడా ఉంది.

చికాగో: యూనివర్సిటీ ఆఫ్ చికాగో, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ఎట్ అర్బన్ క్యాంపెయిన్, ద యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో, ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర విద్యాసంస్థలు ఇక్కడ కొలువై  ఉన్నాయి.

శాన్ ఫ్రాన్సిస్కో: స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా, బెర్క్ లీ ప్రపంచంలో టాప్ 50లో చోటు దక్కించుకున్న విద్యా సంస్థలు ఈ నగరంలో కొలువుదీరాయి.

లాస్ఏంజెల్స్: ప్రపంచంలో 27వ ర్యాంకు సొంతం చేసుకున్న యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ ఇక్కడే ఉంది.

అమెరికాలో విద్యకు సంబంధించి పూర్తి వివరాలు, సహాయ సహకారాల కోసం చాలా సంస్థలు, విభాగాలు, సంఘాలు పనిచేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అందులో ఒకటి. వివరాలకు http://www.usief.org.in/Study-in-the-US.aspx సైట్ చూడవచ్చు. http://www.usembassy.gov/, http://travel.state.gov/content/visas/en.html సైట్ల నుంచి కూడా సమాచారం పొందవచ్చు. అలాగే, దగ్గర్లోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్ లోనూ సంప్రదించవచ్చు.

ఎలా ఉండాలో తెలుసా…?

మొదటి సారి అమెరికా వెళ్లిన వారికి అక్కడ అంతా కొత్తగా అనిపిస్తుంది. తెలియని ప్రాంతం, పరిచయాలు లేని మనుషులు, కొత్త వాతావరణం, వేష భాషలు వేరు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్తదనాన్ని స్వీకరించి దానిలో ఇమిడిపోయేలా ప్రయత్నించాలి. అమెరికా వర్సిటీలు అన్నింటిలోనూ విదేశీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఓ కేంద్రం ఉంది. విద్యార్థులు తమకు కావాల్సిన సమాచారాన్ని, సాయాన్ని ఇక్కడ పొందవచ్చు. విదేశీ విద్యార్థులకు తరచూ ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. ఇతర విద్యార్థులు మీతో మాట్లాడుతున్నప్పుడు అడ్డు పడకుండా శ్రద్ధగా వినడమే మంచింది.

భారతీయ విద్యార్థులు డార్మిటరీలు, ప్రైవేటు గదుల్లో ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు. అయితే, ఎందులో ఉన్నప్పటికీ యూనివర్సిటీకి దగ్గర ఉండేలా చూసుకోవాలి. యూనివర్సిటీ దగ్గర్లోని మెట్రో స్టేషన్ కు సమీపంలోనైనా ఉండేలా చూసుకోవాలి. ప్రైవేటు గదిలో ఉండడం కన్నా డార్మిటరీల్లో ఉండడమే తగినది, గ్యాస్, నీరు, కరెంటు బిల్లుల సమస్య ఉండదు. విదేశీ విద్యార్థులు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకుండా వైద్యం పొందడం గగనమే అవుతుంది. అందుకే యూనివర్సిటీలోని విదేశీ విద్యార్థుల సేవా కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

మాట నిదానం…

అమెరికన్లతో మాట్లాడేప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… వారితో నిదానంగా స్పష్టంగా మాట్లాడాలి. అమెరికన్ల మాట తీరు చాలా వేగంగా ఉంటుంది. దాన్ని చూసి తాము కూడా వేగంగా మాట్లాడాలని భారతీయులు  ప్రయత్నిస్తుంటారు. దీంతో స్పష్టత లోపించి, భారతీయులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అమెరికన్లు జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. ప్రొఫెసర్లు, అమెరికన్ విద్యార్థులతో ముచ్చటించడం ద్వారా అక్కడి చరిత్ర, సంస్కృతి తదితర విషయాలను తెలుసుకోవచ్చు. సాధారణంగా భారతీయ విద్యార్థులు ఇతర భారతీయ విద్యార్థులతో కలసి  వెళుతుంటారు. అయితే, అన్ని సార్లూ అలా చేయకుండా… అప్పుడప్పుడు అమెరికన్ సహచర విద్యార్థులతోనూ కలసి పనిచేయడం, ప్రయాణించడం వల్ల వారితో ఉన్న అంతరం తగ్గుతుంది.

అమెరికాలో భారతీయ వంటకాలు చాలా ఖరీదు. కనుక సొంతంగా వండుకోవడం వల్ల ఎంతో ఖర్చు ఆదా అవుతుంది. ఇంటి ఆహారమే తింటున్నామన్న సంతృప్తి కూడా ఉంటుంది. అమెరికాలో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో కావాల్సిన వన్నీ అభిస్తాయి. ఇక్కడ వినియోగదారులపై అన్ని రకాల నిఘా ఉంటుంది. కనుక తీసుకున్న ప్రతీ వస్తువును బిల్ చేయించి చెల్లించడం మంచిది.

సోషల్ సెక్యూరిటీ నంబర్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు తదితర సున్నితమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. అలాగే, ఏటీఎం, ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ లు తెలపాలంటూ వచ్చే మెయిల్స్ కు కూడా స్పందించవద్దు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. చుట్టూ ఉన్నవారిపై, పరిసరాలపై కన్నేసి ఉంచాలి. అప్రమత్తంగా ఉండడం ద్వారా చాలా నేరాలను తప్పించుకోవచ్చని అక్కడి పోలీసులు చెబుతుంటారు. రాత్రి సమయాల్లో క్యాంపస్ నుంచి బయటకు ఒంటరిగా రాకూడదు. గ్రూపుగా వెళ్లాలి. కంప్యూటర్, బుక్స్, సెల్ ఫోన్ ఇలా వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేదంటే చోరులు చిటికెలో మాయం చేసేస్తారు. ఎవరో వచ్చి తలుపు తడితే తీయవద్దు. సాధారణంగా అమెరికన్లు తెలిసిన వారయితేనే అదీ కనుక్కున్న తర్వాతే తీస్తారు. అదే సురక్షిత విధానం. పిలవకుండా తమంతట తాము ఎవరైనా వచ్చి తలుపుతడితే లోపలి నుంచి మాట్లాడడమే మంచిది. తలుపులు ఎప్పుడూ లాక్ చేసి ఉంచుకోవాలి.

 

Source :  www.ap7am.com